త్వరలో దుర్గం చెరువు వంతెన ప్రారంభోత్సవం: కేటీఆర్‌

గొప్ప చారిత్రిక ప్రాధాన్యత ఉన్న  హైదరాబాద్‌ నగరం గత కొన్ని దశాబ్ధాలుగా క్రమంగా కొత్తరూపు సంతరించుకొని అత్యద్బుతమైన మెట్రో నగరంగా మారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌ నగరం అంటే ఒట్టి ఛార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్‌ మాత్రమే కాదు... ఐ‌టి, పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీ, హెల్త్ కేర్, మెడికల్ టూరిజం, వాణిజ్యం, పర్యాటకం...ఇలా ఒకటేమిటి అనేక రంగాలకు ప్రధానకేంద్రంగా మారింది. ఆ కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు హైదరాబాద్‌ వచ్చి స్థిరపడుతున్నారు. దాంతో వాహనాలు... వాటితో పాటే ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. 

నగరంలో ఐ‌టి కంపెనీలన్నీ మాధాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలలోనే ఉండటంతో ఆ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడానికి జీహెచ్‌ఎంసీ ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు నిర్మించింది. వాటిలో నెంబర్: 1 స్థానంలో నిలువబోతోంది దుర్గంచెరువు తీగల వంతెన (కేబిల్ బ్రిడ్జి). రూ.184 కోట్లు వ్యయంతో దుర్గం చెరువుపై పిల్లర్లు వేయకుండా తీగల ఆధారంగా వ్రేలాడేలా నిర్మించబడిన కేబిల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి చాలా రోజులైంది. అయితే దానికి అత్యాధునికమైన లైటింగ్ వ్యవస్థను చైనా కంపెనీ సరఫరా చేయవలసి ఉంది. గత కొన్ని నెలలుగా భారత్‌-చైనా దేశాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో చైనా నుంచి రావలసిన లైటింగ్ వ్యవస్థ రావడంలో ఆలస్యమైంది. దాంతో కేబిల్ బ్రిజ్ ప్రారంభోత్సవం నిలిచిపోయింది. 

కొన్ని రోజుల క్రితమే లైటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటవడంతో దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్దం అయ్యిందంటూ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టారు. దాంతోపాటు దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జ్ వీడియోను కూడా  పోస్ట్ చేశారు. రాత్రిపూట రంగురంగుల లైటింగ్‌లో దగదగా మెరిసిపోతున్న దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ అందాలు  చూసేందుకు రెండు కళ్ళు చాలావంటే అతిశయోక్తి కాదు. దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ హైదరాబాద్‌ నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణ కాబోతోందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.