
భారత్ సరిహద్దుల వద్ద తిష్టవేసుకొని కూర్చోన్న చైనా సైన్యం శనివారం అర్ధరాత్రి పాంగాంగ్ సో సరస్సు వద్ద సరిహద్దులను మార్చేందుకు మళ్ళీ మరోసారి ప్రయత్నించడంతో అప్రమత్తంగా ఉన్న భారత్ సేనలు వెంటనే వారిని సమర్ధంగా అడ్డుకొన్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మళ్ళీ భారత్-చైనా సైనికుల మద్య తోపులాటలు జరిగినట్లు సమాచారం. కానీ ఈవిషయం ఇంకా దృవీకరించవలసి ఉంది. భారత్ సైనికులను ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టేందుకే చైనా సైనికులు ఆవిధంగా చేసి ఉండవచ్చని సైనికవర్గాలు భావిస్తున్నాయి. అయితే గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటూనే చైనా సైనికులను సమర్ధంగా అడ్డుకొంటున్నామని సైనిక వర్గాలు చెప్పాయి. చైనాతో చర్చల ద్వారా శాంతియుతంగా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని కోరుకొంటున్నామని కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే ధీటుగా తిప్పి కొడతామని చెప్పారు.
ఈ ఏడాది జూన్‌కు 14వ తేదీ అర్ధరాత్రి చైనా సైనికులు ఇలాగే గల్వాన్ వాలీలో సరిహద్దులు మార్చేందుకు ప్రయత్నిస్తుంటే, వారిని అడ్డుకొన్న 22 మంది భారత్ సైనికులను మేకులు వెల్డింగ్ చేసిన ఇనుపరాడ్లతో కొట్టి అతికిరాతకంగా చంపారు. వారి దాడిలో తెలంగాణాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇంతకాలం భారత్ సైనికులే తమను రెచ్చగొట్టారని వాదించిన చైనా ఇటీవలే ఆ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. తద్వారా చైనా సైనికులే ఆ దుశ్చర్యకు పాల్పడ్డారని అంగీకరించినట్లయింది. దురదృష్టకరమైన అటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకొంటున్నామని చెపుతున్న చైనా ఆనాటి నుంచే సరిహద్దుల వద్దకు మరింత భారీగా యుద్ధవాహనాలను, యుద్ధ విమానాలను, యాంటీ క్షిపణి వ్యవస్థలను మోహరించడం మొదలుపెట్టింది. సరిహద్దుల వద్ద రోజురోజుకీ సైనికుల సంఖ్యను కూడా పెంచుతోంది. అంటే ఈ సరిహద్దు వివాదం సాకుతో మళ్ళీ మరోసారి భారత్‌తో ప్రత్యక్షయుద్ధానికి ఉబలాటపడుతోందని భావించవచ్చు. ఈసారి యుద్ధం జరిగితే చైనాకు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నామని త్రివిద దళాల అధినేత బిపిన్ రావత్ చైనాను గట్టిగా హెచ్చరించారు.