అన్‌లాక్‌-4 మార్గదర్శకాలు

సెప్టెంబర్ 1 నుంచి నెలాఖరు వరకు కొనసాగబోయే అన్‌లాక్‌-4 కోసం కేంద్రప్రభుత్వం ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వివరాలు: 

ఆంక్షలు తొలగింపు:

• సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైల్‌ సర్వీసుల పునరుద్దరణకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

• సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అలాగే వినోదం, క్రీడలు, విద్య సంబందిత కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కానీ గరిష్టంగా 100 మందితో మాత్రమే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకోవలసి ఉంటుంది. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, అంత్యక్రియలకు కూడా ఇవే మార్గదర్శకాలు వర్తిస్తాయి.            • సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్స్ పై ఆంక్షలు తొలగింపు. 

• ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించేందుకు సెప్టెంబర్ 21 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, కాలేజీలలో 50 శాతం భోధనా సిబ్బంది, భోధనేతర సిబ్బంది హాజరయ్యేందుకు అనుమతించింది. 

• కంటెయిన్మెంట్ జోన్స్ బయట నివాసం ఉంటున్న 9 నుంచి 12 తరగతుల విద్యార్దులు తమ సమీపంలో ఉపాధ్యాయుల వద్దకు వెళ్ళి పాఠ్యాంశాలకు సంబందించి తమ సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు అనుమతించింది. 

• ఇతర రాష్ట్రాలకు రాకపోకలపై నిషేధం పూర్తిగా ఎత్తివేసింది. ఇకపై ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రనికి వెళ్ళేవారు ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. కానీ ఆయా రాష్ట్రాలలో క్వారెంటైన్ నిబంధనలు పాటించవలసి ఉంటుంది. 

వీటిపై ఆంక్షలు యధాతధం:       

• సిటీ బస్సులు, సాధారణ రైలు సేవలు, అంతర్జాతీయ విమాన సేవలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం యధాతధంగా కొనసాగుతుంది. 

• అలాగే సినిమా హల్స్, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం యధాతధంగా కొనసాగుతుంది. 

• పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు వంటి ఇతర విద్యాసంస్థలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం యధాతధంగా కొనసాగుతుంది. కానీ ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించుకోవచ్చు. 

కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక సూచనలు: 

• ఇకపై కంటెయిన్మెంట్ జోన్ పరిధి బయట ఉండే ప్రాంతాలలో కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ లేదా ఎటువంటి ఆంక్షలు విధించడానికి వీలులేదు. 

• 10 ఏళ్ళలోపు పిల్లలు, 65 ఏళ్ళకు పైబడిన వృద్ధులకు రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కనుక అవసరం లేకుండా బయట తిరగరాదు. వైద్యం వంటి తప్పనిసరి పనులకు మాత్రమే బయటకు వెళ్ళాలి.