తెలంగాణ ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ బహుమతి

మైక్రోసాఫ్ట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి ఓ విలువైన బహుమతిని అందజేసింది. కరోనాపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పాలుపంచుకొనేందుకు సుమారు రూ.3.80 కోట్లు విలువైన వైద్య పరికరాలను అందజేసింది. మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆ కరోనా పరీక్షలకు వినియోగించే 14 అత్యాధునిక పరికరాలను అందజేశారు. వాటితో రోజుకు సుమారు 3,500 కరోనా పరీక్షలు నిర్వహించవచ్చునని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్ తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేస్తోందని ఆయన ప్రశంసించారు. కరోనాతో పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ పరికరాలు చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నామని అన్నారు.