
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలలో ప్రజలందరూ పాల్గొన్నారు. సుమారు 1,300 మందికి పైగా యువత తెలంగాణ కోసం బలిదానాలు చేసుకొన్నారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకొన్నవారి కుటుంబాలకు అండగా నిలబడి వారిని అన్నివిదాలా ఆదుకొంటామని చెప్పిన ప్రభుత్వం, ఆ తరువాత వారిలో 5-600 మందిని మాత్రమే గుర్తించి వారికి సాయం చేసింది. మిగిలినవారికి కూడా సాయం చేయాలని ప్రొఫెసర్ కోదండరాం వంటి పెద్దలు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ శాసనసభ సమావేశాలు మొదలైనపుడు సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులందరూ గన్‌పార్క్‌కు వెళ్ళి అమరవీరులకు నివాళులు అర్పించడం మరిచిపోరు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమనిపించవచ్చు కానీ తెలంగాణ కోసం బలిదానాలు చేసుకొన్నవారి త్యాగాలను ఎన్నటికీ మరిచిపోలేము.
తెలంగాణ కోసం పోరాడినవారిలో దర్శకుడు శంకర్ కూడా ఒకరు. ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ప్రజలలో ఉద్యమస్ఫూర్తిని రగిలించి పోరాటాలు ఉదృతంయ్యేందుకు ఎంతో తోడ్పడిన మాట వాస్తవం. కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయనను సముచిత రీతిలో గౌరవించుకోవలసిందే. అయితే సుమారు 2.5 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.25 లక్షలకే ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగినప్పుడు, ‘ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు కనుక స్టూడియో కట్టుకోవడానికి రాయితీపై ప్రభుత్వం భూమి ఇచ్చిందని’ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదించగా, ‘అలా అయితే ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రభుత్వం రాయితీపై భూమి ఇవ్వగలదా?’ అని హైకోర్టు ఎదురు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పుడూ సహేతుకంగా, పారదర్శకంగా ఉండాలని హైకోర్టు సూచించింది. హైదరాబాద్‌లో ఉన్న కొద్దిపాటి భూములను సినీపరిశ్రమకు కట్టబెట్టవలసిన అవసరంలేదని స్పష్టం చేసింది. ఈ కేసులో రెండు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించి, కేసు తదుపరి విచారణను అప్పటికి వాయిదా వేసింది.