13.jpg)
దుబ్బాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో ఖాళీ అయిన ఆ స్థానానికి త్వరలో ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఆ స్థానాన్ని ఆయన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరికి కేటాయించాలని సిఎం కేసీఆర్ ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకొన్నందున టిఆర్ఎస్లో అది ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ ముగిసినట్లే.
కాంగ్రెస్, బిజెపిలు కూడా దుబ్బాక నుంచి పోటీకి సిద్దపడుతున్నాయి కనుక ఆ రెండు పార్టీలలో ఎవరిని అభ్యర్ధులుగా ఎంపిక చేస్తాయనేది ఎన్నికల షెడ్యూల్ జారీ అయితే కానీ తెలియదు.
సోమవారం నాంపల్లిలోని టిజేఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. దానిలో ఈ ఉపఎన్నికలలో పోటీ చేయాలా వద్దా? చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాలా వద్దా? ఒకవేళ పోటీ చేసేమాటయితే టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలను ఒంటరిగా ఎదుర్కోగలమా లేదా?తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వచ్చే ఏడాది పట్టభద్రుల కోటాలో జరుగనున్న వరంగల్-ఖమ్మం, నల్లగొండ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడంపై కూడా నిన్నటి సమావేశంలో లోతుగా చర్చించారు. పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అక్కడి నుంచి పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మళ్ళీ మరోసారి దీనిపై చర్చించాలని నిర్ణయించారు.
తెలంగాణ జనసమితి పార్టీ ఒక రాజకీయ పార్టీగా ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ విధానాలు, పనితీరుపై చక్కగా స్పందిస్తూ, ఎన్నికలలో పోటీ చేస్తూ తన ఉనికిని బాగానే చాటుకొంటోంది. కానీ ఆ పార్టీలో ప్రొఫెసర్ కోదండరాం తప్ప రాష్ట్రంలో ప్రజలందరికీ బాగా పరిచయమున్న బలమైన నాయకులు ఎవరూ లేకపోవడం ఆ పార్టీ బలహీనతగా కనిపిస్తోంది.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల తీరుతెన్నులు, ఫలితాలు, తదనంతర పరిణామాలను గమనిస్తే ఇప్పటివరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిలు టిఆర్ఎస్తో హోరాహోరీగా పోరాడి అనేకసార్లు ఓడిపోతున్నాయి...కొన్నిసార్లు గెలుస్తున్నాయని అందరికీ తెలుసు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా ఫిరాయింపుల కారణంగా పార్టీకి ఆ ప్రయోజనం దక్కడం లేదు. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలను టిజేఎస్ ఓడించలేదని అందరికీ తెలుసు. కానీ ఒకవేళ ఓడించగలిగినా ఆ గెలిచిన అభ్యర్ధి టిజేఎస్లోనే కొనసాగుతాడనుకోలేము.
కనుక టిజేఎస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేయడం కంటే ముందుగా గ్రామస్థాయి నుంచి పార్టీని నిర్మించుకొని, పార్టీలో ముఖ్యనేతలందరినీ ప్రజలకు పరిచయం చేసి గుర్తింపు ఏర్పరచుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తూ 2023 శాసనసభ ఎన్నికలకు సిద్దమైతే మంచిదేమో?