
గత ఆదివారం మద్దికుంటవాగులో కారుతో సహా కొట్టుకుపోయిన టిఆర్ఎస్ సీనియర్ నేత జంగంపల్లి శ్రీనివాస్ (33) కోసం గత వారం రోజులుగా గజ ఈతగాళ్ళు గాలించినా ఆయన ఆచూకీ కనుగొనలేకపోయారు. శనివారం ఉదయం నంగునూరు మండలం దర్గపల్లి వాగులో చేపలు పట్టేందుకు వెళ్ళిన కొంతమంది వ్యక్తులు అక్కడ వాగు ఒడ్డున పొదలలో ఓ శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అది వాగులో కొట్టుకుపోయిన జంగంపల్లి శ్రీనివాస్‌దేనని నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
జంగంపల్లి శ్రీనివాస్ గత ఆదివారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో మంధని బయలుదేరారు. భారీ వర్షాల కారణంగా సిద్ధిపేట జిల్లాలోని శనిగరం-బద్దిపల్లి మద్య మద్దికుంటవాగు చాలా ఉదృతంగా ప్రవహిస్తోంది. కానీ వాగునీటి ఉదృతిని వారు సరిగ్గా అంచనావేయలేక ముందుకు సాగడంతో వారు ముగ్గురు ఇన్నోవా కారుతో సహా వరదనీటిలో కొట్టుకుపోయారు. శ్రీనివాస్ స్నేహితులు ఇద్దరూ అతికష్టం మీద కారులో నుంచి బయటపడి కేకలు పెట్టడంతో స్థానికులు వారిని రక్షించారు. కానీ శ్రీనివాస్ మాత్రం కారుతో సహా వాగులో కొట్టుకుపోయి చివరికి శవమై తేలాడు. ఆయనకు భార్య మానస, కృతిక, లాస్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనే జంగంపల్లి శ్రీనివాస్ మృతి చెందిన వార్త తెలిసి సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టిఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.