
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ బాటలోనే పయనిస్తూ జిల్లాల పునర్విభజనకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం ఒక జిల్లా చొప్పున 25 జిల్లాలుగా లేదా రాజధాని (?)తో కలిపి 26 జిల్లాలుగా పునర్విభజన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసం నాలుగు ఉపసంఘాలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాల సరిహద్దులను నిర్ణయించడానికి, న్యాయ సంబందిత వ్యవహారాలకు ఒక కమిటీ. జిల్లాల మద్య సిబ్బంది విభజనపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ. ఆస్తుల విభజన, మౌలిక వసతుల కల్పనకు ఒక కమిటీ. సాంకేతిక అంశాల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షణలో పనిచేసే ఈ నాలుగు ఉపసంఘాలకు అవసరమైన సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అందించడానికి మళ్ళీ జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన 13 కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొరకు ప్రత్యేకంగా ఓ తాత్కాలిక సచివాలయం కూడా ఏర్పాటు చేయబోతోంది.
ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేయగలిగితే 2021 జనవరి నెల తరువాత ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావించవచ్చు.