డిసెంబర్‌లోగా కరోనాకు వ్యాక్సిన్‌: కేంద్రమంత్రి

అన్నీ అనుకొన్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్‌లోగా భారత్‌లో కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుతం ఐసీఎంఆర్‌తో కలిసి భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన ‘కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్‌ చాలా చురుకుగా సాగుతున్నాయని, వాటి ఫలితాలు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. కనుక డిసెంబర్‌లోగా కోవాక్సిన్ సిద్దం కావచ్చునని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారుచేసిన వ్యాక్సిన్‌ ‘కోవిషీల్డ్’ కూడా ఇంచుమించు అదే సమయంలో అందుబాటులోకి రావచ్చునన్నారు.

ఈ రెండుకాక జైడస్ కాడిలా కంపెనీ ‘జైకోవ్-డీ’వ్యాక్సిన్‌ కూడా సిద్దం కావచ్చునని అన్నారు. ఈ మూడు వ్యాక్సినన్లు ఒకేసారి సిద్దమైతే ఒక్క భారత్‌లోనే కాదు...యావత్ ప్రపంచ దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ అందించగలుగుతుందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఒకవేళ డిసెంబర్‌నాటికి భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినట్లయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలాఖరులోగా దేశంలో దాదాపు అందరికీ వాక్సిన్ వేయించుకోగలుగుతారు. దాంతో ఇక కరోనా భయాలు లేకుండా ఇదివరకులా తమ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొనేందుకు వీలుపడుతుంది. దాంతో దేశం మళ్ళీ అభివృద్ధి పదంలో మునుదుకు సాగుతుంది.