కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. అయితే రాష్ట్రంలో చాలా రోజులుగా కరోనా కేసులు నిలకడగా ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జారీ చేస్తున్న హెల్త్ బులెటిన్లు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు కూడా ఆ గణాంకాలనే పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలో కరోనా కేసులు, పరీక్షలు, మరణాల గురించి మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే ఓ పక్క వారు ఆ గణాంకాలను అంగీకరిస్తూనే మళ్ళీ రాష్ట్రంలో తగినన్ని కరోనా పరీక్షలు నిర్వహించడం లేదని కరోనాను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పిస్తుండటం విశేషం. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వాదిస్తున్నప్పుడు వారు ఆ గణాంకాలను అంగీకరించకూడదు. కానీ వాటి ప్రాతిపదికనే మాట్లాడుతున్నారు. తద్వారా ప్రతిపక్షాలు తమ అయోమయాన్ని బయటపెట్టుకొంటున్నాయని చెప్పక తప్పదు.