అపెక్స్ కౌన్సిల్‌కు సిఎం కేసీఆర్‌ సై!

రెండు తెలుగు రాష్ట్రాల మద్య నెలకొన్న జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షతన ఇరువురు ముఖ్యమంత్రులతో ఆగస్ట్ 10వ తేదీన అపెక్స్ కౌన్సిల్‌ నిర్వహించాలని కేంద్రం భావించింది. కానీ ఆ సమయానికి సిఎం కేసీఆర్‌ వేరే ఇతర కార్యక్రమాలకు హాజరుకావలసి ఉండటంతో అపెక్స్ కౌన్సిల్‌ ఈ నెల 25వ తేదీన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈసారి సమావేశానికి హాజరయ్యేందుకు సిఎం కేసీఆర్‌ అంగీకరించారు. సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన బుదవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి దీనిపై లోతుగా చర్చించారు.

ఈ నెల 25న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగబోయే అపెక్స్ కౌన్సిల్‌లో తెలంగాణ వాదనలను గట్టిగా వినిపించడమే కాక తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు గట్టిగా సమాధానమిస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వాటిపై చేసిన ఖర్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి వాటి వాస్తవ పరిస్థితి, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా వాటి డిజైన్లలో చేసిన మార్పులు, చేర్పులు, తెలంగాణ ప్రభుత్వం వాటిపై పెట్టిన ఖర్చులు, ఆ ప్రాజెక్టులకు సంబందించి కేంద్రప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వగైరా ప్రతీ విషయాన్ని స్పష్టమైన ఆధారాలతో అపెక్స్ కౌన్సిల్‌లో కేంద్రప్రభుత్వం, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిల ముందుంచి తెలంగాణ వాదనలను బలంగా వినిపిస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. కనుక వాటికి సంబందించి పూర్తి వివరాలు, లెక్కలు, నివేదికలు సిద్దం చేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంపు పనులపై కూడా తన వాదనలను బలంగా వినిపించి దానిని అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు.           

ప్రగతి భవన్‌లో నిన్న జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌ సీ నాగేంద్రరావు,ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, జలవనరులశాఖ సలహాదారు ఎస్‌కె.జోషి తదితరులు పాల్గొన్నారు.