కరోనా నేపద్యంలో ఈసారి సిఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో అతికొద్ది మంది సమక్షంలో మువ్వన్నెల జెండా ఎగురవేసి నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి తదితర ప్రముఖ అధికారులు కొద్దిమంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ఐటి, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సిరిసిల్లా కలెక్టర్ కార్యాలయంలో త్రివర్ణపతాకం ఎగురవేశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ ఆవరణలో జెండా ఎగురవేశారు.
టిఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. చాలా కాలం తరువాత ఇవాళ్ళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, “స్వాతంత్ర్య దినోత్సవం అంటే కేవలం జెండా ఎగురవేయడమే కాదు. మన దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం ఆనాడు పోరాడినవారిని, తమ ప్రాణాలను త్యాగం చేసిన త్యాగమూర్తులను తలుచుకొని వారి గురించి నేటి తరంవారికి తెలియజెప్పడం కూడా చాలా అవసరం. ఈరోజు మనమందరం ఇక్కడ నిలబడి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నామంటే ఆనాడు వారు చేసిన పోరాటాలు.. త్యాగాల వలననే అని మనం మరిచిపోకూడదు,” అని అన్నారు.