దేశమంతటా ఘనంగా పంద్రాగస్ట్ వేడుకలు

నేడు 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు మువ్వన్నెల జాతీయజెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ డిల్లీలో రాజ్‌ఘాట్‌ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన తరువాత ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతాదళాల గౌరవ వందనం అందుకొని ఎర్రకోటపై నుంచి దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్ళు గడిచినప్పటికీ భారత్‌ అన్ని రంగాలలో ఆత్మనిర్భర్ (స్వయంసంవృద్ధి) సాధించలేకపోయింది. కనుక ఈ క్షణం నుంచి మనం ఆ దిశలో అడుగులు వేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం. ఆత్మనిర్భర్ అనేది ఒట్టి నినాదంగా మిగిలిపోనీయకుండా ఆచరణలో పెట్టి మన శక్తిసామర్ధ్యాలను యావత్ ప్రపంచానికి చాటి చెపుదాం. స్థానికంగా ఉత్పత్తి చేసుకొందాం... స్థానిక ఉత్పత్తులనే వినియోగించుకొందాం. మన ఉత్పత్తులను మనమే ఆదరించకపోతే ఇక ఇతర దేశాలు ఎందుకు ఆదరిస్తాయి? అని అందరూ ఆలోచించుకోవాలి. కనుక ఇకపై వోకల్ ఫర్ లోకల్ మన విధానం కావాలి,” అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 

కరోనా వైరస్ నేపధ్యంలో ఈసారి కేవలం 150 మంది విఐపీలను మాత్రమే ఈ కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. ఈరోజు ఎర్రకోట వద్ద పెరేడ్‌ ముగిసిన తరువాత దానిలో పాల్గొన్న భద్రతాదళ సభ్యులందరినీ ముందు జాగ్రత్త చర్యగా క్వారెంటైన్‌లో ఉంచబోతున్నారు.