ప్రగతి భవన్‌ వద్ద ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు మెరుపు ధర్నా

ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కొద్ది సేపటి క్రితం సిఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌ ముందు మెరుపు ధర్నా చేసి పోలీసులకు షాక్ ఇచ్చారు. సుమారు 20-30 మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి ఒక వ్యానులో ప్రగతి భవన్‌ వద్దకు చేరుకొన్నారు. అక్కడే ఉన్న పోలీసులు గమనించేలోగానే వారందరూ వ్యాన్ దిగి పరుగులు తీస్తూ ప్రగతి భవన్‌ గేటు వద్దకు చేరుకొని ధర్నా చేశారు. వారిలో కొందరు గేటుపై నుంచి దూకి ప్రగతి భవన్‌లోకి ప్రవేశించగా అతనిని లోపల ఉన్న పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా నేపద్యంలో సెట్ ప్రవేశ పరీక్షలను వాయిదావేయాలని వారు డిమాండ్ చేశారు. కానీ గేటు బయట ఉన్నవారు “సీఎం డౌన్‌ డౌన్‌... దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం...” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం గమనిస్తే వారు ప్రవేశ పరీక్షల వాయిదా కోసం కాక ఆవిధంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికే వచ్చినట్లు అర్దమవుతోంది. పోలీసులు వారినందరినీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ హడావుడితో కాసేపు ఆ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది.