
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం రూ.8 కోట్లు వ్యయంతో అమరావతిలో నిర్మించిన ‘ప్రజా వేదిక’ భవనాన్ని కూల్చివేసింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సచివాలయం కూల్చివేస్తోంది. ఇప్పుడు కేంద్రప్రభుత్వం వంతు. సుమారు 83 సం.ల క్రితం నిర్మించబడిన పార్లమెంటు భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో భవిష్యత్ అవసరాలకు కూడా తగినట్లుగా ఆధునాతనమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి సిద్దం అవుతోంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియజేసింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పార్లమెంటు భవనాన్ని ఉపయోగించుకొంటున్నామని, అయితే ప్రస్తుత, భవిష్య అవసరాలకు తగినట్లుగా లేదు. పైగా భద్రతాపరంగా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవలసి ఉంది కనుక దానిని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునిక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.