కరోనా కట్టడిలో వైద్యులదే కీలకపాత్ర: మంత్రి ఈటల

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి వరంగల్‌ నగరంలో ఓ ఫంక్షన్ హాల్లో రెండు జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో కరోనా నివారణ చర్యలపై సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ, “రాష్ట్రంలో కరోనా సోకినవారిలో 81 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. మిగిలిన 19 శాతంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. బీపీ, షుగర్, గుండెజబ్బులు వంటి దీర్గకాలిక వ్యాదులున్న పెద్దవారు మాత్రమే కరోనాకు బలవుతున్నారు మిగిలినవారిలో చాలామంది కొలుకొంటున్నారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. కరోనా మహమ్మారి ఇప్పుడు సామాజిక సమస్యగా మారిపోయింది. కనుక కరోనాను కట్టడి చేయడానికి అందరం మరింత గట్టిగా కృషి చేయాలి. ముఖ్యంగా వైద్యులు, వైద్యసిబ్బంది సేవలు ఇప్పుడు చాలా అవసరం. ఆసుపత్రికి వచ్చే ప్రతీ ఒక్కరికీ వైద్యం అందించి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకొనేలా చేయవలసిన బాధ్యత వారిపైనే ఉంది. కరోనా చికిత్సకు నిధుల కొరత లేదు. కనుక ఆసుపత్రులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. త్వరలోనే వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మరో 250 పడకలు అందుబాటులోకి వస్తాయి. కరోనా చికిత్సలో ఎటువంటి అలసత్వం పనికిరాదు. వైద్యులు, వైద్య సిబ్బంది 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండాలి,” అని అన్నారు.