భారత్‌ అమ్ములపొదిలో మరో దివ్యాస్త్రం... ధృవాస్త్ర

భారత్‌ అమ్ములపొదిలో మరో దివ్యాస్త్రం... ధృవాస్త్ర చేరింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు తయారుచేసిన అత్యంత ఆధునాతమైన యాంటీ ట్యాంక్ గైడడ్ మిసైల్ ‘హెలినా’ (హెలికాఫ్టర్‌ ద్వారా ప్రయోగించగల నాగ్ క్షిపణి) ప్రయోగం విజయవంతం అయినట్లు ప్రకటించారు. ఈ నెల 15,16 తేదీలలో ఒడిశాలోని బాలాసోర్‌లోగల క్షిపణి పరీక్షా కేంద్రంలో దీనిని పరీక్షించి చూసినట్లు డీఆర్‌డీవో ప్రతినిధులు తెలిపారు. దీనికి సంబందించిన వీడియోను భారత్‌ వాయుసేన ఈరోజు విడుదల చేసింది. 

ఇది ప్రపంచంలో అత్యంత ఆధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంది. దీనిలో అమర్చిన ఇన్ఫ్రా రెడ్‌ ఇమేజింగ్ సెన్సార్స్ ద్వారా కదులుతున్న లక్ష్యాలను (టాంకులను) వెంబడించి నాశనం చేయగలదు. ఎటువంటి వాతావరణంలోనైనా లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించి నాశనం చేయగలగడం దీని ప్రత్యేకత. పాకిస్థాన్‌, చైనా దేశాలతో  సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో ఇటువంటి అత్యాధునికమైన, శక్తివంతమైన ‘ధృవాస్త్ర’ క్షిపణి వాయుసేన చేతికి అందడం చాలా గొప్ప విషయమే.