
రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయన గన్మెన్, పీఏకు కూడా కరోనా సోకింది. కడియం శ్రీహరి ఇంట్లోనే ఉంటూ కరోనాకు చికిత్స తీసుకొంటున్నారు. ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యశాఖ సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, ఆయనతో సన్నిహితంగా మెలిగినవారికి పరీక్షలు చేస్తున్నారు.
టిఆర్ఎస్లో ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బాజిరెడ్డి గోవర్ధన్, వివేకానంద్ గౌడ్, బీగాల గణేశ్ గుప్తా, గొంగిడి సునీత, వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు దంపతులు కరోనా బారినపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత వి.హనుమంతరావు, మరికొందరు నేతలు కరోనా బారి పది కోలుకొన్నారు. బిజెపిలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి కరోనా బారినపడి కోలుకొన్నారు. టిఆర్ఎస్ నేతలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవలసి వస్తున్నందున కరోనా బారిన పడుతుంటే, ప్రజా సమస్యలపై పోరాడే ప్రయత్నంలో నిత్యం ప్రజల మద్య ఉండవలసిరావడంతో ప్రతిపక్షనేతలు కరోనా మహమ్మారికి చిక్కుతున్నారు.