
కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని హైకోర్టు పదేపదే తప్పుతప్పుపడుతూ తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను పాటించని అధికారులను ఎందుకు సస్పెండ్ చేయమని ఆదేశాలు జారీ చేయకూడదో తెలపాలని హైకోర్టు కోరింది. అధికారులకు చివరి అవకాశం ఇస్తున్నామని, ఇకపై తాము ఆదేశించినట్లు రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచి, కరోనాకు సంబందించి పూర్తి వివరాలను హెల్త్ బులెటిన్లలో రోజూ ప్రకటించాలని ఆదేశించింది లేకుంటే చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించింది. ఈనెల 28న జరుగబోయే విచారణకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి హాజరయ్యి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ విషయాలన్నిటినీ వైద్యఆరోగ్యశాఖ అధికారులు సిఎం కేసీఆర్కు నిన్న వివరించి, కరోనా పరీక్షలు, కట్టడి, చికిత్స, ఏర్పాట్ల కోసం తాము ఎంతగానో కృషి చేస్తున్నప్పటికీ హైకోర్టు చేత నిత్యం చివాట్లు తినవలసివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కరోనాకు సంబందించి మొత్తం 87 పిటిషన్లు దాఖలాయ్యాయని తెలిపారు. రోజూ ఎవరో ఒకరు కరోనా గురించి హైకోర్టులో పిటిషన్లు వేస్తుండటం, వాటిని హైకోర్టు స్వీకరించి విచారణ చేపడుతుండటంతో అన్ని పనులు మానుకొని కోర్టు చుట్టూ తిరగవలసివస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలతో తమ ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని అన్నారు. మీడియా కూడా కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే భావన ప్రజలకు కలిగేలా వార్తలు ప్రచురిస్తుండటం చాలా బాధ కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సిఎం కేసీఆర్ స్పందిస్తూ, హైకోర్టు అడిగిన సమాచారమంతా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సూచించారు. కరోనాను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని చర్యల గురించి పూర్తి సమాచారం హైకోర్టుకు తెలియజేయాలని సూచించారు.
ప్రగతి భవన్లో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ముర్తజా రిజ్వీ, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.