
శిధిలావస్థకు చేరుకొన్న ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాలు నిర్మించాలని కోరుతూ ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు నేటి నుంచి ప్రతీరోజు 2 గంటలు ఆసుపత్రి ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు వారు ఆసుపత్రి ఇన్ ఛార్జ్ సూపరింటెండెంట్‌కు సోమవారం నోటీస్ అందజేసి ఈరోజు భోజనవిరామ సమయంలో కొందరు వైద్యులు ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, “శిధిలావస్థకు చేరుకొన్న ఉస్మానియా ఆసుపత్రి స్థానంలో కొత్త భవనం నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పనిని అడ్డుకొని పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కొత్త భవనం నిర్మాణ పనులు మొదలుపెడితే ఆడుకోవద్దని ప్రతిపక్షాలు చేతులెత్తి దణ్ణం పెట్టి వేడుకొంటున్నాము. ఈ విషయంలో మేమందరం ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాము,” అని అన్నారు.
ధర్నా చేస్తున్న వైద్యులు కూడా మంత్రులు ఆరోపిస్తున్నట్లే ప్రతిపక్షాలు అడ్డుకోవడం వలననే ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించలేకపోయిందన్నట్లు ఆరోపించడం చూస్తే దానిలో రాజకీయకోణం ఉన్నట్లు అనుమానం కలుగుతుంది.
ప్రభుత్వం సచివాలయం కూల్చివేసి దాని స్థానంలో కొత్తది నిర్మించాలనుకొన్నప్పుడూ ప్రతిపక్షాలు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టుకు వెళ్ళాయి. దానిపై ప్రభుత్వం హైకోర్టులో గట్టిగా పోరాడి చివరికి అనుకొన్నది సాధించింది. త్వరలోనే కొత్త సచివాలయం నిర్మించడానికి సిద్దం అవుతోంది. కానీ ఉస్మానియా ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం ఈవిధంగా హైకోర్టులో పోరాడి సాధించేందుకు గట్టిగా ప్రయత్నించలేదు. నిజానికి ప్రభుత్వం తలుచుకొంటే గత 5 ఏళ్లలోనే ఉస్మానియా ఆసుపత్రికి పక్కన లేదా వేరే ప్రాంతంలో కొత్త భవనాలు నిర్మించవచ్చు. కానీ ఎందుకో అప్పటి నుంచి ఎవరూ మళ్ళీ ఉస్మానియా ఆసుపత్రివైపు తొంగి చూడలేదు.
ఇప్పుడు ఆ సమస్యపై తాము పోరాటం మొదలుపెట్టేసరికి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతో మంత్రులు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శిస్తున్నారని, వారు తమ ప్రభుత్వ వైఫల్యాన్ని, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకే తమపై ఎదురుదాడి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ధర్నా చేస్తున్న ఉస్మానియా వైద్యులు కూడా ప్రతిపక్షాలనే విమర్శిస్తుండటం గమనిస్తే వారు కొత్త భవనం కోసం ధర్నా చేస్తున్నారా? లేక ప్రభుత్వాన్ని వెనకేసుకువచ్చేందుకు ధర్నా చేస్తున్నారా? అనే అనుమానం కలగడం సహజం.
ఏది ఏమైనప్పటికీ, వైద్యులు ఈ రాజకీయ సుడిగుండంలో చిక్కుకోకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాలు నిర్మింపజేసుకోగలిగితే మంచిది.