.jpg)
నిజాం నవాబు వంశానికి చెందిన నవాబ్ నజాఫ్ ఆలీఖాన్ సచివాలయం కూల్చివేత వ్యవహారంపై స్పందించారు. ‘సచివాలయంలో జీ బ్లాక్ కింద నవాబులు దాచిపెట్టిన గుప్త నిధులున్నాయని వాటి కోసమే సిఎం కేసీఆర్ అర్ధరాత్రిపూట రహస్యంగా కూల్చివేత పనులు జరిపించారని’ ఇటీవల రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏడవ నిజాం నవాబు మనుమడైన నవాబ్ నజాఫ్ ఆలీఖాన్ వాటిపై స్పందిస్తూ, “జీ-బ్లాక్ క్రింద గుప్త నిధులు ఉన్నాయనే మాట అబద్దం. మా ముత్తాతగారైన ఆరవ నిజాం నవాబు మహబూబ్ ఆలీఖాన్ హుస్సేన్ వేసవి విడిది కోసం దానిని కట్టించుకొన్నారు. కానీ గృహాప్రవేశ సమయంలో అపశకునం కలగడంతో దానిని ఆయన ఎన్నడూ ఉపయోగించుకోలేదు. ఆయన తరువాత బాధ్యతలు చేపట్టిన ఏడవ నిజాం నవాబు అంటే మా తాతగారు ఆ భవనానికి ‘జాబ్-ఏ-హుకుమత్’ అని నామకరణం చేసి దానిని పరిపాలనా వ్యవహారాలకు కార్యాలయంగా వినియోగించుకొన్నారు.
ఒకవేళ ఎవరైనా గుప్తనిధులు దాచుకోవాలనుకొంటే సొంత ఇంట్లో దాచుకొంటారు తప్ప అందరూ వచ్చిపోయే అటువంటి భవనాల క్రింద దాచుకోరు. ఇంత చిన్న విషయం రేవంత్ రెడ్డికి తెలియదనుకోలేము. ఒకవేళ ఆయనకు సిఎం కేసీఆర్తో ఏమైనా రాజకీయ విభేధాలు ఉంటే అది ఆయనతోనే తేల్చుకోవాలి తప్ప ఈ వ్యవహారంలోకి మా వంశాన్ని లాగే ప్రయత్నం చేయడం సరికాదు. ఆయన లేనివి ఉన్నట్లు మాట్లాడి మాకు ఇబ్బంది కలిగించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను లేకుంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయనపై ఫిర్యాదు చేయవలసివస్తుంది,” అని హెచ్చరించారు.