మేము అభ్యంతరం చెపితే ఎప్పుడైనా ఆగారా? మల్లు రవి

ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారంలో టిఆర్ఎస్‌ మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ వాదనలపై సీనియర్ కాంగ్రెస్‌ నేత మల్లు రవి సునిశితంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ మంత్రులు అతితెలివిగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టవచ్చనుకొంటారు తప్ప మేమడిగే ఏ ప్రశ్నకు సూటిగా సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేరు. ఉస్మానియా ఆసుపత్రిని మేము కూల్చద్దన్నామని  ప్రభుత్వం ఆగిపోయిందిట! మరి మల్లన్నసాగర భూసేకరణ, కాళేశ్వరం ప్రాజెక్టు, సచివాలయం వంటి అంశాలపై కూడా మేము అభ్యంతరాలు వ్యక్తం చేసినా తెలంగాణ ప్రభుత్వం ఆగలేదు కదా? ఒక్క ఉస్మానియా ఆసుపత్రి విషయంలోనే ఎందుకు ఆగిపోయింది? అంటే సిఎం కేసీఆర్‌కు పేదలకు సేవలందిస్తున్న ఆసుపత్రిపై ఏమాత్రం ఆసక్తిలేదు కనుక. కానీ సచివాలయంపై మాత్రం చాలా ఆసక్తి ఉంది. అందుకే నిక్షేపంగా ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి వందల కోట్లు ఖర్చుచేసి కొత్తది కట్టేందుకు సిద్దం అవుతున్నారు. అసలు ఆ డబ్బుతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించవచ్చు కదా? టిఆర్ఎస్‌ మంత్రులు మాపై ఎదురుదాడి చేసి తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు తప్పించుకోవాలనుకొంటున్నారు. చారిత్రిక ప్రాధాన్యం ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని కూల్చవద్దని మేము చెప్పామే కానీ పక్కనే ఉన్న 23 ఎకరాల ఖాళీ స్థలంలో కొత్త భవనాలు నిర్మించవద్దని చెప్పలేదే?అయినా ఈ ఆరేళ్ళలో సిఎం కేసీఆర్‌ ఏనాడైనా ప్రతిపక్షాల సలహాలు, సూచనలు పట్టించుకొన్న దాఖలాలు ఉన్నాయా? సిఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాలు నిర్మించాలి,” అని అన్నారు.