
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వార్డులలోకి డ్రైనేజీ నీళ్ళు పొంగిపొరలడంతో అధికార, ప్రతిపక్షాల మద్య మళ్ళీ యుద్ధం మొదలైంది. ముందుగా ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్, బిజెపి నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర వియమర్శలు గుప్పించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానాలు ఇచ్చారు.
ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “శిధిలావస్థకు చేరుకొన్న ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి కట్టిస్తానని సిఎం కేసీఆర్ చెప్పినప్పుడు ఇవే ప్రతిపక్షాలు అభ్యతరం చెప్పాయి. కోర్టులకు వెళ్ళి అడ్డుపడ్డాయి. ఇప్పుడు అవే ప్రతిపక్షాలు ఉస్మానియా ఆసుపత్రికి కొత్తభవనాలు ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిపనులకు అడ్డుపడుతూ మళ్ళీ ప్రభుత్వాన్ని నిందించడం వాటికి పరిపాటిగా మారిపోయింది. ప్రతిపక్షాల నిర్వాకన్ని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారని మరిచిపోయినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు,” అని అన్నారు.