
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించబడిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పరిపాలానా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారు. ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనిస్తూ రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేయాలనుకొంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నందున వాటిని ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కానీ గత ఏడాది నుంచి నేటి వరకు వరుసగా ఒకదాని తరువాత మరొక అనూహ్య పరిణామాలు సంభవిస్తుండటంతో, ఆ ప్రతిపాదన ఇంతవరకు ఆచరణలో పెట్టలేకపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా సంక్షోభం నెలకొన్నప్పటికీ అది ఇప్పట్లో సమసిపోయేలా లేదు కనుక జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనను అటక మీద నుంచి దింపి, వాటి ఏర్పాటుకు ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది.
ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధ్యయన కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కనుక త్వరలోనే ఏపీలో కూడా 25 లేదా రాజధాని(?)తో కలిపి 26 జిల్లాలను ఏర్పాటు చేయడం ఖాయంగానే భావించవచ్చు.