
హైదరాబాద్‌లోని నాంపల్లి వద్దగల రాష్ట్ర కాంగ్రెస్ ప్రధానకార్యాలయం గాంధీభవన్‌లోకి కరోనా ప్రవేశించింది. గాంధీభవన్ కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో ముందు జాగ్రత్తచర్యగా వారం రోజులపాటు గాంధీభవన్ మూసివేయాలని నిర్ణయించారు. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవలసివస్తే, ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలపై పోరాడుతూ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రజల మద్య తిరుగవలసి వస్తుంటుంది. దాంతో అధికార, ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నప్పటికీ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు కరోనా మహమ్మారి అధికార, ప్రతిపక్షాల కార్యాలయాలు, క్యామ్ ఆఫీసులలోకి కూడా జొరబడుతుండటంతో తమ కార్యక్రమాలను కొనసాగించేందుకు చాలా ఇబ్బందిపడుతున్నారు.