సచివాలయం కూల్చివేతపై రేవంత్ రెడ్డి కొత్త ట్విస్ట్

చాలారోజులుగా మీడియాకు దూరంగా ఉన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సచివాలయం కూల్చివేత వ్యవహారంలో అనూహ్యమైన విషయం ప్రస్తావించారు. మంగళవారం ఆయన తన క్యాంప్ కార్యాలయమలో మీడియాతో మాట్లాడుతూ, “సచివాలయం కూల్చివేత వ్యవహారం వెనుక చాలా పెద్ద రహస్యముందని నేను భావిస్తున్నాను. సచివాలయంలో అత్యంత పురాతనమైన జీ బ్లాక్‌ ఆరో నిజాం నవాబు మహబూబ్ ఆలీఖాన్ 1888లో నిర్మించారు. మింట్ కాంపౌండ్ కూడా దానిలో భాగమే కనుక నిజాం నవాబుల సంపదను అక్కడి రహస్య నేలమాళిగలలో భద్రపరిచి ఉండవచ్చు. గతంలో అంటే 2012,2016లో సచివాలయం సమీపంలో విద్యారణ్య పాఠశాల, హోంసైన్స్ కాలేజీ నిర్మాణాల కోసం త్రవ్వకాలు జరిపినప్పుడు ఆ ప్రాంతంలో మూడు సొరంగాలు బయటపడ్డాయి. అవి మింట్ కాంపౌండ్ నుంచి జీ-బ్లాక్ వరకు ఉన్నట్లు అప్పుడే పురావస్తుశాఖవారు నిర్ధారించారు. ఆ మూడు సొరంగ మార్గాలను పరిశోధించి, వాటి రహస్యాలను చేదించేందుకు అనుమతి కోరుతూ పురావస్తుశాఖ జీహెచ్‌ఎంసీకి ఒకటి రెండు లేఖలు కూడా వ్రాసింది. కానీ జీహెచ్‌ఎంసీ స్పందించలేదు. ఈవిషయం సిఎం కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆయన జీ బ్లాకు క్రింద నేలమాళిగలలో గుప్తనిధులు ఉండవచ్చనే ఆలోచనతో అర్ధరాత్రిపూట రహస్యంగా దానిని కూల్చివేయిస్తున్నారు. ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు చేస్తునప్పుడు, గతంలో రాజస్థాన్‌లో పోక్రాన్ వద్ద అణుబాంబు పరీక్షిస్తున్నప్పుడు కూడా ఇంత రహస్యం పాటించలేదు. ప్రజలందరికీ తెలిసేలా పారదర్శకంగా నిర్వహించారు. కానీ జీ బ్లాక్ కూల్చివేసినప్పుడు మాత్రం కట్టుదిట్టమైన భద్రత మద్య అర్ధరాత్రిపూట అత్యంత రహస్యంగా చేశారు. ఎందుకు?సాధారణంగా గుప్తనిధుల కోసమే అర్ధరాత్రి పూట తవ్వకాలు జరుపుతుంటారు. అంటే జీ-బ్లాకులో ఏమైనా గుప్తనిధులన్నాయా? అందుకే    కూల్చివేతపనులను పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించడం లేదా? ఇవాళ్ళ కాకపోతే రేపైనా ఈ అంశంపై కోర్టుకు సంజాయిషీ ఇవ్వవలసి రావచ్చు. కనుక కోర్టుకు సమర్పించడానికైనా వీడియో తీయించారా?లేకపోతే ఎందుకు తీయించలేదో చెప్పాలి.  

ఇదంతా సిఎం కేసీఆర్‌ ఒక ముందస్తు పధకం ప్రకారమే చేస్తున్నారని అనుమానం కలుగుతోంది. జీ-బ్లాక్ కింద గుప్తనిధులు ఉంటే దానిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే కొత్త సచివాలయ నిర్మాణం ప్రతిపాదనను తెరపైకి తెచ్చారేమో?కనుక హైకోర్టు ఈ దిశలో కూడా ఆలోచించి నా ఆరోపలను సుమోటోగా స్వీకరించాలని మీడియా ద్వారా హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.