మా ముఖ్యమంత్రి ఎక్కడున్నారు?

సిఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌ వద్ద బుదవారం ఒక విచిత్రమైన ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం ఒక యువకుడు బైక్ వచ్చి ప్రగతి భవన్‌ గేటు ముందు బండిని ఆపి, జేబులో నుంచి ఓ కాగితం తీసి ప్రదర్శించాడు. దానిపై “ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కడ? మా ముఖ్యమంత్రి ఎక్కడున్నారో తెలుసుకొనే హక్కు మాకుంది,” అని వ్రాసుంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు అది గమనించి అతనిని పట్టుకొనేలోగా అతను బైక్ ఎక్కి వెళ్లిపోయాడు. హటాత్తుగా జరిగిన ఈ ఘటనపై సెక్యూరిటీ సిబ్బంది కలవరపడ్డారు. అక్కడున్న సిసి కెమెరాలలో ఆ యువకుడిని, అతని బైక్ నెంబర్ ఆధారంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.  

ప్రగతి భవన్‌ సిబ్బందిలో 30 మందికి కరోనా సోకడంతో ముందుజాగ్రత్త చర్యగా సిఎం కేసీఆర్‌ వారం రోజుల క్రితం గజ్వేల్లోని తన నివాసానికి తరలివెళ్లిపోయారు. ప్రగతి భవన్‌లో ఉన్నప్పుడు ఆయన నిత్యం మంత్రులు, అధికారులతో సమీక్షాసమావేశాలలో పాల్గొంటుండేవారు కనుక ఆ వార్తలు ఎప్పటికప్పుడు మీడియాలో వస్తుండేవి. దాంతో ఆయన ప్రజల మద్యనే ఉన్నారనే భావన ఉండేది. కానీ సిఎం కేసీఆర్‌ గజ్వేల్ వెళ్ళిపోయినప్పటి నుంచి ఆయనకు సంబందించి ఎటువంటి వార్తలు మీడియాలో రాకపోవడంతో ఆ యువకుడు ఈవిధంగా చేసి ఉండవచ్చు. 

అయితే సిఎం కేసీఆర్‌ గజ్వేల్ నుంచే మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ పాలనాపరమైన అన్ని పనులు చక్కబెడుతున్నారు. సిఎం కేసీఆర్‌ బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌ జెడ్పీటీసీ నాగం భూమయ్య, వెంకట్రావుపేట మాజీ సర్పంచ్‌ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డిలకు ఫోన్‌ చేసి వరదకాలువల నిర్వహణ, నీటి లభ్యత తదితర అంశాల గురించి మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు సలహాలు అడిగి తెలుసుకొన్నారు.