
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కరోనా భయంతో దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకొంటున్నారు. నగరంలో మందుల దుకాణాల యజమానులు కూడా కరోనా భయంతో సాయంత్రం 7గంటలకు మూసివేయబోతున్నట్లు తాజా సమాచారం. కరోనాను కట్టడి చేయడానికి హైదరాబాద్ నగరంలో మళ్ళీ రెండువారాలు లాక్‌డౌన్ విధించాలనుకొంటున్నట్లు సిఎం కేసీఆర్ సూచనప్రాయంగా చెప్పారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నగరంలో పరిస్థితులను సమీక్షించారు.
నగరంలో కరోనాను కట్టడి చేయడానికి రెండువారాలు లాక్‌డౌన్ విధించాలని వైద్యఆరోగ్యశాఖ సూచనల మేరకు లాక్‌డౌన్ విధించడానికి తగిన ప్రతిపాదనలు సిద్దం చేయవలసిందిగా సిఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. కోటిమందికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించడమంటే చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని, కనుక లాక్‌డౌన్‌కు ప్రత్యామ్నాయాలను కూడా సూచించవలసిందిగా అధికారులను ఆదేశించారు. వారి ప్రతిపాదనల మేరకు మూడునాలుగు రోజులలో మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తరువాత హైదరాబాద్‌తో దేశంలో అన్ని చోట్ల ప్రజల కదలికలు పెరగడంతో మళ్ళీ కరోనా విజృంభిస్తోందని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ లాక్‌డౌన్ విధించవలసివస్తే మళ్ళీ ఇదివరకులా కటినంగా ఆంక్షలు అమలుచేయవలసి ఉంటుందని అప్పుడే సత్ఫలితాలుంటాయని సిఎం కేసీఆర్ అన్నారు. సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తే ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు రోజుకు కేవలం 2 గంటలు మాత్రామే అనుమతించడం మంచిదని సిఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కొత్తగా 983 కేసులు నమోదు కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 816 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కనుక నగరంలో కరోనాను కట్టడి చేయడానికి మళ్ళీ లాక్‌డౌన్ విధించడం అనివార్యంగానే కనిపిస్తోంది. బహుశః జూలై 1 నుంచి 15వరకు విధించే అవకాశం ఉంది.