కలెక్టర్ హరిచందనకు కేంద్రమంత్రి ప్రశంశలు

నారాయణ్ పేట జిల్లా కలక్టర్ దాసరి హరిచందనకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ ప్రశంశలు అందుకొన్నారు. దేశంలో చాలా ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో టాయిలెట్స్ లేకపోవడం వలన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఒక మహిళగా వారి సమస్యను అర్ధం చేసుకొన్న జిల్లా కలక్టర్ దాసరి హరిచందన, ఒక పాత ఆర్టీసీ బస్సును టాయిలేట్‌గా మార్పించి కోస్గీ పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంచారు. అది మహిళలకు  చాలా ఉపయోగకరంగా ఉండటంతో మంచి ఆదరణ లభించింది. 

కలక్టర్ దాసరి హరిచందనకు ఈ ఆలోచన రాగానే ఒక పాత బస్సును పూణేకు పంపించి బయో-డైజస్టర్ విధానంతో పనిచేసే షీ- టాయిలేట్‌గా మార్పించారు. ఆ బస్సుపైన సౌర ఫలకాలు కూడా అమర్చడంతో లోపల విద్యుత్ సౌకర్యం ఏర్పడింది. బస్సులో టాయిలేట్ పోగా ఇంకా చాలా స్థలం మిగిలి ఉంటుంది కనుక దానిలో ఒక చిన్న టీ-స్టాల్ కూడా ఏర్పాటు చేయించారు. మహిళలు అక్కడ ప్రశాంతంగా కూర్చొని టీ త్రాగి వెళ్ళవచ్చు. ఆ మొబైల్ షీ- టాయిలేట్‌ వినియోగించే మహిళల భద్రత కోసం ఒక మహిళ అటెండర్‌ను కూడా నియమించారు. ఈ షీ టాయిలేట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతంలో మహిళలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ షీ-టాయిలేట్ నిర్వహణను కోస్గి పట్టణ మహిళా సమాఖ్యకు అప్పగించినట్లు కలక్టర్ దాసరి హరిచందన తెలిపారు.


ఆ షీ- టాయిలేట్‌ను పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నెల 20న దానిని ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్, పర్యాటక కేంద్రాల వద్ద కూడా ఇటువంటివి ఏర్పాటు చేసేందుకు మరో రెండు పాత బస్సులను  షీ-టాయిలెట్స్ గా మార్పిస్తున్నారు. మరో వారం పది రోజులలో అవి మహబూబ్‌నగర్‌ చేరుకొంటాయని సమాచారం. వీటి గురించి తెలుసుకొన్న కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ కలక్టర్ దాసరి హరిచందనను ప్రశంశించారు. పాడైపోయిన పాత బస్సులను ఈవిధంగా ఉపయోగించుకోవడం గొప్ప ఆలోచనే కదా?