కాంగ్రెస్‌ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కరోనా పాజిటివ్

సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావుకు కరోనా బారిన పడ్డారు. నాలుగైదురోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని శుక్రవారం నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆయన హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే అంతకు ముందు ఆయన తన నివాసంలో కాంగ్రెస్‌ నేతలు దామోదర రాజనర్సింహ, వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. ఆ తరువాత కరోనా నిర్ధారణ అయిన శుక్రవారంనాడే ఆయన రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన 200 మంది పేదప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయనతో సహా కాంగ్రెస్‌ నేతలందరూ మాస్కూలు ధరించి భౌతికదూరం పాటించినప్పటికీ ఆయన ద్వారా ఎంతమందికి కరోనా వ్యాపించిందో అనే భయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈ సమాచారం అందుకొన్న జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ సిబ్బంది వి.హనుమంతరావు నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను హోం క్వారెంటైన్‌లో ఉండాలని కోరారు. రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలో పాల్గొన్నవారినందరినీ గుర్తించి వారిని కూడా హోం క్వారెంటైన్‌లో ఉండాలని కోరారు. 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇదివరకే టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి కరోనా సోకడంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొంటున్నారు. ఇప్పుడు వి.హనుమంతరావుకు కూడా కరోనా సోకడంతో ఇకపై పార్టీలో అందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతలు కరోనా బారినపడుతుండటంతో వ్యక్తిగతంగా ఇబ్బందిపడటమే కాకుండా రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రెండున్నర నెలలు రాజకీయ నాయకులు కూడా ఇంట్లో నుంచి కాలుబయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా సడలించినప్పటికీ కరోనా భయంతో స్వేచ్ఛగా రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నారు. ఒకవేళ ధైర్యంచేసి పాల్గొంటే ఈవిధంగా ఎవరో ఒకరు కరోనాబారిన పడుతున్నారు. టిఆర్ఎస్‌ దెబ్బకు బలహీనపడిన కాంగ్రెస్‌, బిజెపిలు ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా తమ ఉనికిని చాటుకొనేందుకు కరోనా అవకాశం లేకుండా చేస్తోంది.అంటే కరోనాతో అధికార పార్టీకంటే ప్రతిపక్షపార్టీలకే ఎక్కువ నష్టం జరుగుతున్నట్లు భావించవచ్చు.