ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో తగినంత బలం లేకపోవడంతో అనేక కీలక బిల్లులు ఆమోదింపజేసుకోలేకపోయేది. కానీ 19 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో బిజెపి 8 సీట్లు, గెలుచుకోవడంతో రాజ్యసభలో బిజెపి బలం 86కి పెరిగింది. ఎన్డీయేలో పార్టీలను, బయట నుంచి మద్దతు ఇస్తున్న మిత్రపక్షాలను కూడా కలుపుకొంటే 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయేకు సుమారు 100 మంది సభ్యుల మద్దతు లభిస్తుంది. తాజా ఎన్నికలలో కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలుచుకొన్నప్పటికీ 41 సీట్లే కావడంతో ఇకపై రాజ్యసభలో ఎన్డీయే ప్రవేశపెట్టబోయే ఏ బిల్లును అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న వైసీపీ ఈ ఎన్నికలలో 4 సీట్లు గెలుచుకోవడంతో పార్లమెంటులో మరింత బలపడినట్లయింది.