అలనాడు విరాటపర్వంలో పాండవుల అజ్ఞాతవాసం భంగం చేయడానికి కౌరవులు విరాటరాజ్యంపై ఒకేసారి ఉత్తర,దక్షిణ దిశల నుండి దండయాత్ర చేసినట్లు, ఇప్పుడు భారత్‌పై ఒకవైపు ముంచి చైనా...మరోవైపు నుంచి పాకిస్థాన్ సవాళ్ళు విసురుతున్నాయి.
లడక్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండగా, మరోపక్క కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భారత్ దళాలు నిత్యం వారితో పోరాడుతూనే ఉన్నాయి. జనావాసల మద్య నక్కి పోరాడుతున్నవారికి, వేర్పాటువాదులకు పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్ ద్వారా ఆయుధాలు సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతాదళాలు వమ్ము చేశాయి.
ఈరోజు తెల్లవారుజామున సుమారు 5 గంటలకు సరిహద్దు జిల్లా అయిన కధువాలో పన్సార్ చెక్ పోస్ట్ మీదుగా ఓ పాకిస్తానీ డ్రోన్ వెళుతుండటం గమనించిన భారత్ జవాన్లు వెంటనే దానిని తుపాకులతో కాల్చి కూల్చివేశారు. అది భారత్ సరిహద్దుకు సుమారు 250 మీటర్లలోపలకు వచ్చి కూలిపోవడంతో దానిని సరిహద్దు భద్రతాదళాల అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. దానికి ఒక అత్యాధునిక రైఫిల్, రెండు మ్యాగజిన్లు, 60 రౌండ్ల తూటాలు, ఏడు గ్రెనేడ్లు బిగించబడి ఉన్నాయి. అవన్నీ సరిహద్దుకు ఇవతల ఉన్న వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు అందజేయాడానికే పంపిస్తుండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం సైనికాధికారులు, పాక్ ప్రభుత్వంలో ఎవరూ ఇంతవరకు స్పందించలేదు.