కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం బారీ పరిహారం

గాల్వన్ లోయలో చైనా సైనికుల చేతిలో హత్యకు గురైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సిఎం కేసీఆర్‌ భారీ ఆర్ధికసాయం ప్రకటించారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు ప్రభుత్వంలో గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. త్వరలోనే తాను స్వయంగా కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్ళి ఆయన తల్లితండ్రులను, భార్యపిల్లలను పరామర్శించి వారికి చెక్ అంధజేస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

అదేవిధంగా చైనా సైనికుల దాడిలో చనిపోయిన మిగిలిన 19 మంది సైనికుల కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున నగదు పరిహారం అందజేస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ సొమ్మును కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ద్వారా వారి కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు. 

దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన అమరవీరుల కుటుంబాలకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగూ వారి కుటుంబాలకు ఆర్ధికసాయం చేస్తాయి కానీ యావత్ దేశప్రజలు కూడా వారి కుటుంబాలకు అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని, అప్పుడే సరిహద్దుల వద్ద పనిచేస్తున్న సైనికులకు యావత్ దేశం తమ వెంట ఉందనే నమ్మకం, ధైర్యం కలుగుతాయన్నారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికీ యావత్ దేశ ప్రజలు, కేంద్రప్రభుత్వం ఏవిధంగా వివిద రూపాలలో సంఘీభావం తెలిపారో అదేవిధంగా ఇప్పుడు అమర జవాన్ల కుటుంబాలకు కూడా సంఘీభావం తెలుపవలసిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీకి సిఎం కేసీఆర్‌ సూచించారు.