చైనా దళాల దాడిలో 20 మంది సైనికులు మృతి!

లడక్‌లోని గాల్వాన్ లోయ వద్ద గస్తీలో ఉన్న భారత్‌ సైనికులపై సోమవారం రాత్రి చైనా దళాలు దాడి చేయడంతో ఒక కమాండింగ్ ఆఫీసర్, ఇద్దరు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. కానీ మరో 17 మంది జవాన్లు చనిపోయారని భారత్‌ ఆర్మీ ప్రకటించింది. భారత్‌ సరిహద్దులను కాపాడే ప్రయత్నంలో చైనా దళాల దాడిలో మరో 17 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని అక్కడ అత్యంత శీతల వాతావరణం నెలకొని ఉన్న కారణంగా తీవ్రంగా గాయపడిన 17 మంది జవాన్లు చనిపోయారని మంగళవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో భారత్‌ ఆర్మీ తెలిపింది. 

ఇరుదేశాల సీనియర్‌ కమాండర్‌ స్థాయి అధికారుల  స్థాయిలో శాంతి చర్చల తరువాత చైనా దళాలు సరిహద్దుల వద్ద నుంచి వెనక్కు వెళ్లిపోయెందుకు అంగీకరించారని, వారు వెనక్కు వెళ్లిపోతున్నారని భావిస్తున్న తరుణంలో చైనా సైనికులు సోమవారం రాత్రి వెనక్కు తిరిగి వచ్చి భారత్‌ జవాన్లపై రాళ్ళు, ఇనుపరాడ్లతో ఆకస్మికంగా దాడి చేశారని తెలిపింది. భారత్‌ జవాన్లు కూడా ధీటుగా స్పందించి వారిని ఎదుర్కొన్నారని తెలిపింది. ఇరుదేశాల సైనికుల ఘర్షణలో చైనాకు చెందిన 43 మంది జవాన్లు మరణించి ఉండవచ్చని తెలిపింది. 

చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా తమ జవాన్లు మరణించారని పేర్కొంది కానీ ఎంతమంది మరణించారో తెలియజేయలేదు. గాల్వాన్ ప్రాంతం చైనాదేనని భారత్‌ సైనికులే తమ భూభాగంలోకి ప్రవేశించి చైనా సైనికులపై దాడి చేశారని ఆరోపించారు. భారత్‌ సైనికులు పదేపదే చైనా భూభాగంలోకి ప్రవేశిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, తమ సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని చైనా విదేశాంగ ప్రతినిధి భారత్‌ను హెచ్చరించారు. తాము భారత్‌తో ఘర్షణ కోరుకోవడం లేదని కానీ అవసరమైతే ధీటుగా జవాబు ఇవ్వగలమని చైనా విదేశాంగ ప్రతినిధి చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది.