
భారత్-చైనా ఉన్నతస్థాయి సైనిక సమావేశం తరువాత చైనా దళాలు వెనక్కు మళ్ళడంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తఠఌ తగ్గాయని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తాజా ఘటనలు చెపుతున్నాయి. భారత్-చైనా దళాల మద్య ఘర్షణలు జరిగాయి. చైనా దళాల దాడిలో భారత్‌కు చెందిన ఇద్దరు జవాన్లు, ఒక కమాడింగ్ ఆఫీసర్ మృతి చెందారు. లడాక్‌లోని గాల్వాన్ వాలీలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే ఇరు దేశాల దళాల మద్య ఎటువంటి కాల్పులు జరుగలేదని కేవలం బాహాబాహీ తలపడినప్పుడు భారత్‌కు చెందిన ముగ్గురు చనిపోయారని ఓ అధికారి చెప్పారు. చైనా దళాలలో కూడా కొంతమంది గాయపడినట్లు, చనిపోయినట్లు తెలుస్తోంది.
గాల్వాన్ వాలీలో గస్తీ కాస్తున్న భారత్ దళాలపై సోమవారం రాత్రి అకస్మాత్తుగా చైనా సైనికులు దాడి చేశారని భారత్ సైనికులు చెపుతుంటే, భారత్ దళాలే సరిహద్దులు దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించి తమ సైనికులపై దాడి చేశారని చైనా చెపుతోంది.
చైనా సైనికుల దాడిలో భారత్ జవాన్లు చనిపోవడంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు ఉదయం త్రివిదదళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిదదళాల అధిపతులు, విదేశాంగమంత్రి జయశంకర్‌లతో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. గత నెలరోజులుగా భారత్- చైనా దళాల మద్య 5సార్లు ఇటువంటి ఘర్షణలు జరిగాయి. కానీ ఈసారి ఘర్షణలలో ఇద్దరు భారత్ జవాన్లు, ఒక కమాడింగ్ ఆఫీసర్ చనిపోవడంతో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.