
తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాకాలం సీజన్ నుంచి కొత్తగా అమలుచేస్తున్న నియంత్రిత సాగువిధానంపై సిఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో వివిద శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాకాల వ్యవసాయపనులు మొదలైనందున వారం పది రోజులలో రైతులందరి ఖాతాలలో రైతు బంధు సొమ్ము జమాచేయాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎకరానికి రూ.5,000 చొప్పున ఈ సీజనులో రైతు బంధు పధకం కోసం రూ.7,000 కోట్లు అవసరంకాగా దానిలో రూ.5,500 కోట్లు ఇప్పటికే వ్యవసాయశాఖ ఖాతాలో జమా అయ్యింది. మిగిలిన రూ.1,500 కోట్లు కూడా వారం రోజులలోగా జమా చేయాలని ఆర్ధికశాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో నూటికి నూరు శాతం రైతులు నియంత్రితసాగు విధానంలో పంటలు వేయడానికి అంగీకరించడం చాలా ఆనందం కలిగిస్తోందని సిఎం కేసీఆర్ అన్నారు. దేశంలో అత్యధికంగా పంటలు పండించే పంజాబ్ వంటి రాష్ట్రాలలో పంటల విధానాలలో లోటుపాట్లను పరిశీలించిన తరువాత వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు అందరితో చర్చించిన తరువాతే ఈ నియంత్రితసాగు విధానం రూపొందించామని చెప్పారు.
మూస వ్యవసాయ విధానంలో ఏటా తీవ్రంగా నష్టపోతున్న రైతులకు లబ్ది చేకూర్చాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే దీనిని అమలుచేస్తున్నామన్నారు. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్లు పంటలు పండిస్తే రైతులు లాభపడతారని సిఎం కేసీఆర్ అన్నారు. తరచూ ఒకే రకం కాకుండా వేర్వేరు పంటలు వేస్తుండటం వలన పంటలకు చీడపీడల బాధలు గణనీయంగా తగ్గుతాయని, భూసారం కూడా పెరుగుతుందని సిఎం కేసీఆర్ అన్నారు.
ఈ నియంత్రితసాగు విధానం వలన రైతులు మరింత లబ్ధి పొందేందుకు వీలుగా ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మిల్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వచ్చే యాసంగి పంటలకు కూడా అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.