
సాధారణంగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కనీసం 2 వారాలు సాగుతుంటాయి కానీ కరోనా నేపధ్యంలో ఈసారి ఏపీ బడ్జెట్ సమావేశాలను రెండు రోజులలో ముగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 16,17 తేదీలలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఆనవాయితీ ప్రకారం రేపు ఉదయం గవర్నర్ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. కానీ ఈసారి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శాసనసభకు రారు. విజయవాడలో రాజ్‌భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉభయసభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు.
అది పూర్తికాగానే ఉభయసభల బీఏసీ సమావేశాలు నిర్వహించి అజెండా ఖరారు చేస్తారు. మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి వెంటనే ఆమోదిస్తారు. వెంటనే ఉభయసభలలో రాష్ట్ర బడ్జెట్‌ను, దాంతోపాటు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టి చర్చ ప్రారంభిస్తారు.
బుదవారం సాయంత్రంలోగా బడ్జెట్‌పై చర్చలను ముగించి ఆమోదం తెలపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆదే రోజున కొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టి ఆమోదించబోతోంది. కరోనా నేపధ్యంలో కేవలం రెండు రోజులలో మొత్తం అన్ని కార్యక్రమాలు ముగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ సాధ్యం కాకపోతే మరొక రోజు సమావేశాలు పొడిగించే అవకాశం ఉంది.
ఈసారి కరోనా...లాక్డౌన్ కారణంగా మార్చిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ రాజ్యాంగం ప్రకారం జూలైలోగా సమావేశాలు నిర్వహించవలసి ఉంది. కనుక ఈ నెలలోనే శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.