
దేశంలో అన్ని రాష్ట్రాలు కరోనా మహమ్మారితో పోరాడుతుంటే పొరుగు రాష్ట్రం ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల మద్య రాజకీయయుద్ధం పతాకస్థాయిలో కొనసాగుతుండటం విశేషం. మాజీ మంత్రి, టిడిపి ఎల్పీ నేత కింజారపు అచ్చెనాయుడిని నిన్న ఉదయం అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడంతో టిడిపి భగ్గుమంటోంది. ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఏసీబీ పోలీసులు అచ్చెనాయుడిని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
దీనిపై ఓ పక్క రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ఆందోళనలకు సిద్దం అవుతుండగానే, ఏపీ పోలీసులు మరో టిడిపి నేతను ఈరోజు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. వారిరువురూ దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులకు ఇన్స్యూరెన్స్ చెల్లించకుండా చెల్లించినట్లు నకిలీ పత్రాలు సమర్పించారని, బీఎస్ఈ వాహనాలను బీఎస్ఈ-4 వాహనాలుగ మార్చేందుకు నకిలీ ఎన్ఓసీలు సృష్టించారని వారిపై అభియోగాలు మోపి అరెస్ట్ చేశారు. ఇరువురినీ ఈరోజు అనంతపురం జిల్లా కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు.