
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సిఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నిజామాబాద్ మునిసిపల్ ఎన్నికలలో బిజెపి తరపున పోటీ చేసి గెలిచిన ఆరుగురు కార్పొరేటర్లలో ఇటీవల ఐదుగురు టిఆర్ఎస్‌లో చేరిపోయారు. బిజెపి కార్పొరేటర్లను టిఆర్ఎస్‌లోకి ఆకర్షించినందుకు బండి సంజయ్ సిఎం కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “మా కార్పొరేటర్లను ఎత్తుకుపోవడం వలన మీకేమైనా లాభం కలుగుతుందో లేదా తెలియదు కానీ బిజెపికి మాత్రం ఎటువంటి నష్టం లేదు. బిజెపి తరపున పోటీ చేసి టిఆర్ఎస్‌లోకి ఫిరాయించి వారు ప్రజల, పార్టీ నమ్మకాన్ని వమ్ము చేశారు. బిజెపితో చెలగాటం ఆడాలనుకొంటే టిఆర్ఎస్‌కే ప్రమాదమని సిఎం కేసీఆర్, కేటీఆర్ గుర్తుంచుకొంటే మంచిది. సిఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు ఇంతవరకు గనులు, సాగునీటి ప్రాజెక్టులలోఅవినీతికి పాల్పడ్డారు. వారి అవినీతి ఏదో ఓ రోజు బయటపడక మానదు. ఇప్పుడు వ్యవసాయరంగంలోకి కూడా అవినీతి వేళ్ళను జొప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. దానిని మేము తప్పకుండా అడ్డుకొంటాము,” అని ఆరోపించారు.
బండి సంజయ్ ఆరోపణలను మంత్రి గంగుల కమలాకర్ గట్టిగా తిప్పి కొట్టారు. “బండి సంజయ్ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి అనర్హుడు. అసలు ఏ ప్రాతిపదికన ఆయనకు బిజెపి అధిష్టానం ఆ పదవి కట్టబెట్టిందో అర్ధం కాదు. సిఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కేసీఆర్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోము. కేసీఆర్ నాయకత్వంలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆ సంగతి ప్రజలందరికీ తెలుసు కానీ బండి సంజయ్‌కి మాత్రమే తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది,” అని అన్నారు.