ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మళ్ళీ ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఈరోజు మళ్ళీ మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పదవిలో నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ చెల్లదని, కనుక ఆయనకు మళ్ళీ బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. దానిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవి రాజ్యాంగబద్దమైనదని, అటువంటి పదవిలో ఉన్న వ్యక్తిని ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తొలగించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టింది కూడా. హైకోర్టు ఇచ్చిన తీర్పు సరిగానే ఉందని కనుక దానిపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో చాలా మంది ప్రతివాదులు ఉన్నారు కనుక అందరికీ నోటీసులు జారీ చేసి, ఒకవేళ వారు కొంతర్లు దాఖలు చేసినట్లయితే విచారణ చేపట్టి రెండువారాలలోగా తీర్పు వెలువరిస్తామని చెప్పింది.