జూ.డాక్టర్లతో మంత్రి ఈటల చర్చలు

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఓ కరోనా రోగి నిన్న మరణించడంతో అతని బందువు జూనియర్ డాక్టర్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అందుకు నిరసనగా వారు నిన్నటి నుంచి విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వారితో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. జూనియర్ డాక్టర్లు ప్రధానంగా 4 డిమాండ్లు మంత్రి ఈటల ముందుంచారు. వాటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ దిశలో ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది కనుక చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశాలున్నాయి. 

1. వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై దాడులు చేసేవారిని కటినంగా శిక్షించాలి. అటువంటి కేసులలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందిపై ఎటువంటి చర్యలు తీసుకొంది? ఇకపై ఎటువంటి చర్యలు తీసుకొంటుంది? అనే విషయం స్పష్టం చేయాలి. దానిపై విస్తృతంగా మీడియాలో ప్రచారం చేయాలి. 

2. రాష్ట్రంలో ఎక్కడ కరోనా కేసులు నమోదవుతున్నా రోగులను నేరుగా గాంధీ ఆసుపత్రికే తీసుకువస్తున్నారు. దీనివలన వైద్యులు, వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. కనుక ఇకపై జిల్లా స్థాయిలోనే కరోనా రోగులకు చికిత్స అందించేవిధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. 

3. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి వైద్యులందరిపై ఒత్తిడి పెరిగిపోతోంది. కనుక తక్షణమే అదనంగా వైద్యులను నియమించాలి. 

4. ప్రస్తుతం పీజీ చేస్తున్న జూనియర్ డాక్టర్లను సీనియర్ రెసిడెంట్స్ గా తీసుకోవాలి.