
రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో సిఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఉదయం శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, “కరోనా బారినపడి వైద్యులు, జర్నలిస్టులు మరణిస్తుంటే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. కరోనాపై ఎవరు కుట్ర చేస్తున్నారో సిఎం కేసీఆర్ స్వయంగా చెప్పాలి. ఆయన ప్రగతి భవన్‌లో లేదా తన ఫాంహౌసులో చాలా భద్రంగానే ఉంటున్నారు కానీ రాష్ట్రంలో లక్షలాది పేద ప్రజల పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? సామాన్య ప్రజలు కరోనా... లాక్‌డౌన్‌తో నానాకష్టాలు పడుతుంటే సిఎం కేసీఆర్ వారికి ఎటువంటి సాయం చేయలేదు. పైగా ఈ కష్టకాలంలో వారిపై విద్యుత్ బిల్లుల భారం మోపుతున్నారు. ప్రగతి భవన్‌లో కూర్చున్న సిఎం కేసీఆర్‌కు సచివాలయంలో ఏమి జరుగుతోందో తెలుసా?” అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఈ గురువారం సీఎల్పీ నేతృత్వంలో ఛలో సెక్రెటరీయెట్ కార్యక్రమం చేపడతామని చెప్పారు.