కేటీఆర్‌ అక్రమాస్తులు ఇవిగో...రేవంత్‌ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మళ్ళీ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి కేటీఆర్‌ జువ్వాడలోని అక్రమంగా ఫాంహౌసు నిర్మించుకొన్నారని నేను ఆరోపిస్తే దాంతో తనకు ఎటువంటి సంబందమూ లేదని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. ప్రభుత్వ వి‌ప్‌ బాల్క సుమన్ కేటీఆర్‌ ఆ భూములను నాలుగేళ్ళ క్రితం లీజుకు తీసుకొన్నారని చెప్పారు. కేటీఆర్‌ అక్రమాస్తుల గురించి ప్రశ్నించినందుకు టిఆర్ఎస్‌  నేతలు మిడతలదండులా నామీద పడుతున్నారు. నాపై ప్రత్యారోపణలు చేసి వాస్తవాలను కప్పి పుచ్చాలనుకొంటున్నారు. కానీ నా ఆరోపణలు నిజమని నిరూపించే సాక్ష్యాధారాలు మీ ముందుంచుతున్నాను. 

బాల్క సుమన్ చెప్పినట్లుగా ఈ భూములు కేటీఆర్‌ లీజుకు తీసుకోలేదు. తన భార్య శైలిమ పేరిట జువ్వాడలో సర్వే నెంబర్‌ 301లో మే 2018లో ఒకసారి, మార్చి 2019లో మరోసారి భూములు కొనుగోలు చేశారు. వాటికి సబందించిన డాక్యుమెంట్లు ఇవిగో! 2018 ముందస్తు ఎన్నికలలో కేటీఆర్‌ నామినేషన్ ఫారంతోపాటు సమర్పించిన అఫిడవిట్‌లో తనకు ఆర్భనా వెంచర్‌ సర్వే నెంబర్ 313లో భూమి ఉందని, ఆ వెంచర్‌లో తనకు రూ.2.70 లక్షల రూపాయల వాటా కూడా ఉందని పేర్కొన్నారు. మరి ఆ సర్వే నెంబర్లలో తనకు భూములు లేవని కేటీఆర్‌ ఎందుకు అబద్దం ఆడుతున్నారు? బాల్క సుమన్ ఆయనను ఎందుకు వెనకేసుకు వస్తున్నారు? జీవో 111కు వ్యతిరేకంగా కేటీఆర్‌ అక్కడ ఫాంహౌసు నిర్మించుకొన్నారని నేను ఆరోపిస్తే టిఆర్ఎస్‌ నేతలు నాపై ఎదురుదాడి చేసి నా నోరు మూయించాలని ప్రయత్నిస్తున్నారు. 

ఈ వ్యవహారంపై గ్రీన్‌ ట్రిబ్యూనల్ విచారణ చేపట్టింది కనుక కేటీఆర్‌ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలి లేదా సిఎం కేసీఆర్‌ ఆయనను పదవిలో నుంచి బర్త్ రఫ్ చేయాలి,” అని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.