
తెలంగాణ శాసనసభ సమావేశాలలో సీఏఏను వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బిజెపి ఎంపీలు మంగళవారం ఉదయం డిల్లీలో పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కొంతసేపు మౌనదీక్ష చేశారు.
అనంతరం ఎంపీ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో యావత్ తెలంగాణ ప్రజలు తలవంచుకోవలసి వస్తోంది. వేరే దేశాల నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన ముస్లింలను వెనకేసుకొస్తే భారతీయ ముస్లింలు నష్టపోరా? అయినా రాష్ట్రంలో వేలాదిమంది రైతులు, ఇంటర్ విద్యార్దులు, ఆర్టీసీ సమ్మె సందర్భంగా 33 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోని సిఎం కేసీఆర్, ఓవైసీలు యావత్ దేశప్రజల గురించి ఆలోచిస్తున్నారంటే నమ్మశక్యంగా ఉందా? కేసీఆర్, ఓవైసీలు కేవలం ముస్లింల ఓట్లు కోసమే సీఏఏపై అనవసర రాద్దాంతం చేస్తున్నారు తప్ప సీఏఏ వలన దేశంలో ముస్లింలు ఏవిధంగా నష్టపోతారో చెప్పలేకపోతున్నారు. కేసీఆర్, ఓవైసీలు అంగీకరించినా అంగీకరించకపోయినా సీఏఏ, ఎన్‌పీఆర్‌లు దేశమంతటా తప్పక అమలవుతాయి. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారు కూడా తమ పేర్లను జాతీయపౌరపట్టికలో నమోదు చేయించుకోక తప్పదు. పార్లమెంటు చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో చేసిన తీర్మానం ఓ చిత్తుకాగితంతో సమానం,” అని అన్నారు.