తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ మేరకు బుదవారం సాయంత్రం డిల్లీలో అధికారికంగా ప్రకటించారు. బిజెపి అధ్యక్షుడిగా మళ్ళీ కె.లక్ష్మణ్‌నే కొనసాగించాలని బిజెపి అధిష్టానం భావించినప్పటికీ ఆయన సున్నితంగా ఈ అవకాశాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. 

బండి సంజయ్‌ మొదట ఆర్‌ఎస్ఎస్‌, ఏబీవీపీలో క్రిందస్థాయి నుంచి పనిచేసి ఉండటంతో గల్లీ నుంచి డిల్లీ వరకు ఆయనకున్న పరిచయాలు కూడా ఇప్పుడు బాగా పనికివచ్చాయి. సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ తదితర టిఆర్ఎస్‌ నేతలను చాలా ధైర్యంగా ఎదుర్కొనేవారని బండి సంజయ్‌కు పార్టీలో మంచి పేరుంది. 

బండి సంజయ్‌ 2014 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు కానీ 2019 లోక్‌సభ ఎన్నికలలో సిఎం కేసీఆర్‌కు కుడి భుజమని చెప్పుకోబడే సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్‌ను ఓడించి తన సత్తా చాటుకున్నారు. ఆ విజయం కూడా ఇప్పుడు అధ్యక్ష పదవికి అర్హుడిగా చేసిందని చెప్పవచ్చు.

రాష్ట్రంలో బిజెపి బలంగా ఉన్నప్పటికీ టిఆర్ఎస్‌ ధాటిని తట్టుకోలేకపోతోంది. పైగా ప్రధాని నరేంద్రమోడీ-సిఎం కేసీఆర్‌ మద్య నెలకొన్న అవగాహన వలన రాష్ట్ర బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌, తెరాస సర్కార్‌పై చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు విలువలేకుండాపోతోంది. ఆ కారణంగా రాష్ట్ర బిజెపి నేతలు ప్రజల నమ్మకాన్ని పొందలేకపోతున్నారు. 

ఈ నేపధ్యంలో రాష్ట్ర బిజెపి పగ్గాలు చేపట్టిన బండి సంజయ్‌ పార్టీని బలోపేతం చేసుకొంటూ 2023 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్దం చేసుకోవలసి ఉంటుంది. మరి సంజయ్‌ నేతృత్వంలో బిజెపి బండి ఏవిధంగా ముందుకు సాగుతుందో చూడాలి.