జగిత్యాలలో కశ్మీర్ పోలీసుల విచారణ!

కశ్మీర్‌కు చెందిన ప్రత్యేక పోలీసుల బృందం ఒక వ్యక్తిని విచారించేందుకు జగిత్యాల జిల్లాలో మల్లాపూర్‌కు వచ్చింది. మల్లాపూర్‌కు చెందిన రాకేశ్ అనే వ్యక్తి ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు. ఈమేరకు వారు అతనిపై కేసు కూడా నమోదు చేసారు. సోమవారం మల్లాపూర్ చేరుకొన్న కశ్మీర్‌ ప్రత్యేక పోలీసుల బృందం మల్లాపూర్ పోలీసుల సహకారంతో రాకేశ్‌ను అదుపులో తీసుకొని మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సంతృప్తికరమైన సమాధానాలు లభించనట్లయితే జిల్లా న్యాయస్థానం అనుమతితో అతనిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ కోసం తమతో కశ్మీర్‌ తీసుకువెళ్ళే అవకాశం ఉంది.