రేవంత్‌, కొండా రెడ్డి అరెస్ట్

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వారి అనుచరులను ఈరోజు సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్‌ గండిపేట చెరువు సమీపంలో అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించుకొన్నారని ఆరోపిస్తూ వారు దానిని ముట్టడికి బయలుదేరారు. ఈవిషయం తెలుసుకొన్న పోలీసులు వారిని దారిలో జన్వాడ వద్ద అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి కేటీఆర్‌ 111 జీవోను అతిక్రమించి నిబందనలకు విరుద్దంగా గండిపేట వద్ద 25 ఎకరాలలో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారు. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఈవిధంగా చేయడం సరికాదు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇద్దరూ ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు,” అని అన్నారు.  

రేవంత్‌ రెడ్డి సోదరులు గోపన్‌పల్లిలో సర్వే నెంబర్ 127లో కోట్లు విలువచేసే భూములను అక్రమంగా తమపేర్లకు బదలాయించుకొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దానిపై ఆర్డీవో చంద్రకళ విచారణ జరుపుతున్నారు. రాజోలి ఎస్సీ హౌసింగ్ సహకార సంఘం సభ్యులు ఇటీవల రేవంత్‌ రెడ్డి సోదరులపై ఆమెకు ఫిర్యాదు చేశారు. ఈ నేపద్యంలో రేవంత్‌ రెడ్డి కేటీఆర్‌ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించుకొంటారని ఆరోపణలు చేయడం విశేషం. రేవంత్‌ రెడ్డి ఆరోపణలపై కేటీఆర్‌ ఇంకా స్పందించవలసి ఉంది.