సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు పోలీసుల విచారణలో హత్య జరిగిన చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్ద లైట్లు లేకపోవడంతో చీకటిగా ఉన్నందునే నిందితులు ఆ ప్రదేశాన్ని ఎంచుకొన్నారని తేలింది. కనుక మళ్ళీ అటువంటి ఘటనపు పునరావృతం కాకుండా నివారించేందుకు హెచ్ఎండీఏ, ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అధికారులు లైట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 158 కిమీ పొడవున్న ఔటర్‌రింగ్ రోడ్డులో మొత్తం 165 అండర్ పాస్‌లున్నాయి. రూ.1.90 కోట్లు వ్యయంతో వాటన్నిటిలో లైట్లు అమర్చుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల లైట్లు అమర్చగా, మరికొన్ని చోట్ల ఇంకా విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి.
ఇది చాలా మంచి నిర్ణయమే. అయితే ఇటువంటి ఘటనలు ఒక్క హైదరాబాద్‌లోనే కాక రాష్ట్రంలో పలుప్రాంతాలలో జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో హాజీపూర్ గ్రామంలో ముగ్గురు మైనర్ బాలికల హత్యాచారాల గురించి అందరికీ తెలిసిందే. హాజీపూర్ నుంచి మండల కేంద్రానికి వెళ్ళేందుకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్ధులు ఆటోలలో వెళ్ళివస్తుంటారు. ఒక్కోసారి ఆటోలు దొరకనప్పుడు, నిర్మానుష్యంగా ఉండే (3 కిమీ) రోడ్డులో నడిచివస్తుంటారు. ఆ మార్గంలో ఎక్కడా వీధిదీపాలు కూడా లేనందున చీకటిపడితే ఆ రోడ్డులో ప్రయాణించడం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ముగ్గురు బాలికల హత్యాచారాలకు ఇటువంటి చిన్న చిన్న సమస్యలే అవకాశం కల్పించాయని అర్ధమవుతోంది. కనుక తమ ఊరికి ఓ ఆర్టీసీ బస్సు, వీధి దీపాలు, పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని హాజీపూర్ గ్రామస్తులు కోరారు. కానీ ఇంతవరకు అవి ఏర్పాటు కాలేదు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుందని నిరూపితమైంది కనుక రాష్ట్రమంతటా ఇటువంటి ఏర్పాట్లు చేయడం అత్యవసరం.