రేవంత్‌ రెడ్డిపై ఆర్డీవో చంద్రకళకు పిర్యాదులు!

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డిలపై రాజోలి ఎస్సీ హౌసింగ్ సహకార సంఘం సభ్యులు శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళకు పిర్యాదు చేశారు. తామందరం కలిసి ఇళ్ళు నిర్మించుకొనేందుకు గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్ 127లో ఒక్కొక్కరూ 300 గజాల చొప్పున మొత్తం 2,700 గజాల భూమిని కొనుగోలుచేశామని, రేవంత్‌ రెడ్డి సోదరులు వాటిలోకి తమను ప్రవేశించనీయకుండా అడ్డుకొంటున్నారని ఆర్డీవో చంద్రకళకు ఫిర్యాదు చేశారు. తామందరం ఎంతో కష్టపడి సంపాదించుకొన్న డబ్బుతో ఆ స్థలాలను కొనుగోలుచేశామని కానీ రేవంత్‌ రెడ్డి సోదరులు ఆక్రమించుకొన్నారని వారు ఫిర్యాదు చేశారు. పక్కనే ఉన్న సర్వే నెంబరు 124లో కూడా రేవంత్‌ రెడ్డి సోదరులు మరో 300 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నారని వారు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. కనుక రేవంత్‌ రెడ్డి సోదరుల నుంచి తమ భూములను తమకు ఇప్పించాలని వారు ఆర్డీవో చంద్రకళను కోరారు. 

గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్ 127లో వివాదాస్పద భూములపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఆర్డీవో చంద్రకళకు విచారణ బాధ్యతలు అప్పగించింది. 

అయితే ఆ భూములతో తమకు ఎటువంటి సంబందమూ లేదని, అసలు గోపన్‌పల్లిని తాను ఎన్నడూ చూడనేలేదని అన్నారు. సిఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందున రాజకీయకక్షతోనే తనపై ఈ భూవివాదం కేసు పెట్టారని రేవంత్‌ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. 

అయితే మీడియాలో పరస్పర విమర్శలు, ఆరోపణలతో నిజానిజాలు తెలియవు కనుక కోర్టులోనే అవి బయటపడవచ్చు. ఒకవేళ ఈ భూవివాదంతో రేవంత్‌ రెడ్డి సోదరులకు ఎటువంటి సంబందమూ లేనట్లయితే, ఎంపీపై తప్పుడు కేసులు పెట్టినందుకు టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి మున్ముందు న్యాయస్థానంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి సోదరులకు ఈ భూవివాదంతో సంబందం ఉన్నట్లయితే వారికీ న్యాయస్థానంలో ఆదేరకమైన సమస్యలు ఎదుర్కోవలసిరావచ్చు.