దిశ నిందితుల కుటుంబాలకు సుప్రీంకోర్టులో నిరాశ

రాష్ట్రంలో దిశ అత్యాచారం, హత్య ఘటన ఎంత సంచలనం సృష్టించిందో, ఆ కేసులో నిందితులుగా అనుమానించబడిన నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దానిపై జాతీయమానవ హక్కుల కమీషన్, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన న్యాయవిచారణ కమీషన్ వేర్వేరుగా విచారణ జరిపాయి. ఎన్‌కౌంటర్ చేయబడిన నిందితుల కుటుంబాలను, ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులను కూడా ప్రశ్నించి నివేదికలు రూపొందించాయి. కానీ ఆ తరువాత ఆ నివేదికలు ఏమయ్యాయో... వాటి విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియని పరిస్థితి.

ఈ నేపధ్యంలో నలుగురు నిందితల తరపున వారి న్యాయవాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. నిందితులే వారి కుటుంబాలకు జీవనాధారం కనుక వారిని కోల్పోయిన ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ సుప్రీంకోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పటికే ఈ కేసుపై విచారణ జరిపేందుకు న్యాయ కమీషన్ వేసినందున, ముందుగా వారిని కలవాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే చెప్పారు. ఒకవేళ అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని భరోసా ఇచ్చారు.